
జన్నారం, వెలుగు: అదివాసీలను రాజకీయంగా చైతన్యపరిచడమే కాంగ్రెస్ లక్ష్యమని, అందుకోసమే ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ శిక్షణ ప్రొగ్రాం కన్వీనర్ రాహుల్ బల్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అదివాసీ నాయకుల శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న రాహుల్‌బల్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా అదివాసీలు రాజకీయంగా ఎదగలేకపోయారని అన్నారు.
అదివాసీలు దేశ వెన్నుముక లాంటివారని, వారి ఆచారాలు ఎంతో ప్రత్యేకంగాఉంటాయన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ అన్ని వ్యవస్థల మీద దెబ్బకొట్టినట్లుగానే అదివాసీల ఆచారాలను సైతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని ఆదివాసీలను చైతన్యం చేసి వారి నాయకత్వాన్ని తయారు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే అదివాసీలకు రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ప్రధాన నేత అత్రం సుగుణ, క్యాంపు నిర్వహకులు మల్లేశ్వరి, రాణా ప్రతాప్, దుర్గం భాస్కర్, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, టౌన్ ప్రెసిడెంట్ దుమ్మల్ల రమేశ్, మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.